ప్రజాశక్తి - కాకినాడ Sat, 21 Jul 2012, IST
ప్రజాశక్తి - కాకినాడ
ప్రకృతిలో మనకు కనిపించే నిర్మాణాల్లో భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలకం. అందమైన అద్దాల మేడలు, రోడ్లు, బ్రిడ్జిలు, ప్రాజెక్టులు చారిత్రక కట్టడాలు సృష్టించేది నిర్మాణ కార్మికులే. అటువంటి ప్రతిభ కలిగిన కార్మికుల బతుకుల్లో అంధకారం చోటుచేసుకుంటోంది. పెట్టుబడిదారీ సమాజంలో నిర్మాణ రంగం వేగం పుంజుకుంది. పాత వాటి స్థానంలో కొత్త రూపాల్లో నిర్మాణ పనులు నిరంతరం జరుగుతున్నాయి. అపారమైన ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయి. ఇంజనీర్లు వేసే ప్లానులకు విద్యనేర్వని నిర్మాణ కార్మికులు తమ మేథస్సుతో అందమైన నిర్మాణాలుగా ప్రాణ ప్రతిష్ట చేస్తారు. మానవ చరిత్రలో నిర్మాణ రంగం చాలా మార్పులకు గురవుతూ ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది. 16వ శతాబ్ధం నుంచే నిర్మాణ పనుల ప్రాధాన్యత సంతరించుకుంది. ఈజిప్టు పిరమిడ్లు, తాజ్‌మహల్, చార్మినార్, కోణార్క్ దేవాలయం తదితర కట్టడాలు నిర్మాణ కార్మికుల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు.
మన జిల్లాలోని భవన నిర్మాణ రంగంలో 2.50 లక్షల మంది కార్మికు లున్నారు. రోజుకు 8 గంటల నుంచి 10 గంటలు పని చేయడం వల్ల ఒక్కో ప్రాంతాన్ని బట్టి రూ.250 నుంచి రూ.300 వరకు రోజు వేతనం వస్తుంది. ఈ పని కష్టంతో కూడుకున్నది. ఎండ, వాన, చలిని తట్టుకుని పని చేయాలి. సిమెంట్ ప్రభావం వల్ల దీర్ఘకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. భవనాలపై నుంచి పడిపోవడం, రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, లేదా శాశ్వత అంగవైకల్యానికి గురౌతున్నారు. అందమైన భవనాలు నిర్మించే వారి బతుకులు మాత్రం అంధవికారంగా తయారవుతున్నాయి. ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాల అమలు ఫలితంగా సిమెంట్, ఐరన్ ఇతర ముడి సరుకుల ధరలు పెరుగుదల వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. కోర్డు ఆదేశాలతో ఆరు నెలలుగా ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో జిల్లాలోని 2.50 వేల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఆకలితో పస్తులుండాల్సి వస్తోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల బలైంది నిర్మాణ కార్మికులు. వీటికి తోడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్నులు, నీటి పన్నులు పెంచి వారిని మరింతగా కుంగదీసింది. నిర్మాణ కార్మికులకు సొంతిళ్లు లేవు. ఏ ఒక్క ప్రజాప్రతినిధీ వారి సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రిలయన్స్ అంబానీ లాంటి బడా పెట్టుబడిదారుడికి రూ.5,700 కోట్ల విలువైన 14 అంత్తుల భవనం ఉంది. అందులో ఉండేది ముగ్గురు. దానిలో పని చేసే కార్మికులు 700 మంది. కానీ ఆ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులకు కనీసం సొంత గూడు లేదు. సమాజంలో అంతరాలు ఈ విధంగా పెరిగిపోతున్నాయి. కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ఉండటానికి ఇల్లు, రోజూ ఉపాధి కోరుతున్నారు.
జిల్లాలో అమలు కాని భవన నిర్మాణ కార్మిక చట్టం
భవన నిర్మాణ కార్మికులు ప్రమాద భద్రత కోరుతున్నారు. దాని కోసం సిఐటియు నాయకత్వంలో 1989 నుంచి నిరంతరం ధర్నాలు, చలో అసెంబ్లీలు, సమ్మెలు చేశారు. ఫలితంగా ఆరుగురు ముఖ్యమంత్రుల పాలనలో 1996లో భవన నిర్మాణ కార్మిక చట్టానికి రూపకల్పన జరిగింది. అయితే 2007 వరకు అమలుకు నోచుకోలేదు. పథకం అమలు చేయాలని కోరుతూ యూనియన్ 2007 మార్చిలో సుప్రీం కోర్టులో ఫిల్ వేసింది. దీంతో సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయ వేసి, రాష్ట్రంలో తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు పథకం అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ 2007 మే ఒకటో తేదీన చట్టం చేశారు. ఒక మనిషి చేసే పని ద్వారా లాభం పొందిన వ్యక్తి ఆ మనిషి సంక్షేమాన్ని పట్టించుకోవాలనేది చట్టం సారాంశం. ఆ విధంగా ఒక శాతం సెస్ వసూలు చేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని ఖర్చు పెట్టేందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటైంది. అయితే దీనిలో భవన నిర్మాణ కార్మికులు గానీ, నాయకులు గానీ లేరు. దీంతో కార్మిక కష్టాలు బోర్డులో ఉన్నవారికి పూర్తిస్థాయిలో అర్థం కాలేదు. సంక్షేమ చట్టంలో నమోదు చేయించుకున్న వ్యక్తి గడిచిన సంవత్సరంలో 90 రోజులు తక్కువ కాకుండా పని చేయాలి. ఈ పథకానికి రూ.50 రుసుం, సంవత్సర సభ్యత్వం రూ.12 కలిపి కార్మిక సంక్షేమాధికారి వద్ద నమోదు చేయించుకోవాలి. దీనికి రెండు పాస్ పార్ట్ ఫొటోలతో ప్రభుత్వం గుర్తింపు పత్రం జారీ చేయాల్సి ఉంది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. తద్వారా బీమా సాయం ప్రమాదంలో చనిపోయిన లేదా శాశ్వత అంగవైలక్యం పొందిన వారికి రూ.2 లక్షలు, 50 శాతం అంగవైకల్యానికి లక్ష రూపా యలు, 25 శాతం నుంచి 49 శాతం వరకు రూ.50 వేలు, ఒకటి నుంచి 25 శాతం వరకు రూ.25 వేల సాయం అందుతుంది. అనారోగ్యం సమయంలో రోజుకు రూ.100 చొప్పున నెలకు రూ.1,500 మించకుండా మూడు నెలల వరకు ఇస్తారు. మరణించిన కార్మికుల మట్టి ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఇస్తారు. మహిళా కార్మికుల, కార్మికుల ఆడపిల్లల పెళ్లి నిమిత్తం ఇద్దరికి రూ.5 వేలు వివాహ కానుకగా ఇస్తారు. నమోదు కాని కార్మికుడు చనిపోతే రూ.5 వేల ఇవ్వాలి. చట్టంలో పైన చెప్పినవన్నీ ఈ జిల్లాలో అమలు కావడం లేదు. కార్మిక సంక్షేమాధికారులను ఇదేమని ప్రశ్నిస్తే 'మన జిల్లాయే కాదు... రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు' అని దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రమాద పరిహారాలు పొందే లబ్దిదారులను కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రయివేట్ బిల్డర్ల నుంచి, ప్రభుత్వ శాఖల నుంచి సెస్ వసూలు చేస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షలు మంది కార్మికులుండగా ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదు చేయించుకున్నది లక్షా 26 వేల మంది మాత్రమే. అందులో సుమారు 43 మంది ఉపాధి హామీ కూలీలు కలిపి. నేటికీ కార్మిక శాఖ నూరు శాతం చేయలేదు. రెన్యూవల్స్ అయితే కేవలం 60 శాతం మాత్రమే జరిగాయి. దీనికి కారణం కార్మిక శాఖ నిర్లక్ష్యమే. యూనియన్ల ఉన్న చోట రెన్యూవల్స్ చేస్తున్నారు. లేని చోట చేయడం లేదు. ఈ ఏడాది మార్చి వరకూ ప్రమాదాలకు గురై శాశ్వతంగా అంగవైకల్యం పొందిన ముగ్గురికి రెండు లక్షలు, పాక్షిక అంగవైకల్యం పొందిన నలుగురికి రూ.50 వేలు ఇచ్చినట్లు కార్మిక శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో క్లెయిమ్‌లు రావడం లేదు. నిధులు లేవని కార్మిక శాఖాధికారులు చెబుతున్నారు. అయితే సెస్ సంక్షేమ బోర్డులో సుమారు రూ.800 కోట్లున్నాయి. వాటిని ప్రభుత్వ ఖజానాకు మళ్లించారు. ఈనేపథ్యంలో కార్మికులు చట్టం అమలుకు పోరాటాలకు సన్నద్ధమౌతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ సిఐటియు ఆధ్వర్యాన కార్మిక సమస్యలపై సర్వేలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేగాని సమస్యలు పరిష్కారం కావు. ఇందుకు కార్మికులంతా ఏకతాటిపై నిలిచి హక్కులను పరిరక్షించుకోవాలి.
బాలం శ్రీనివాస్,
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకుడు.
No comments:
Post a Comment