Saturday, 21 July 2012

Yasalpu Suryarao


కష్టజీవుల కవి యాసలపు సూర్యారావు

                       అక్షరం, ఆచరణ రెంటినీ కలగలిపి నడిపించడం అందరికీ సాధ్యం కాదు. ఉద్యమం, జీవితం చెట్టాపట్టాలేసుకొని నడవడమూ అంత ఆషామాషీ కాదు. ప్రజా ఉద్యమ ప్రస్థానంలో ఆటుపోట్లు తట్టుకొని... కష్టనష్టాలు ఎదుర్కొని... కవిగా, రచయితగా, అంతకుమించి ప్రజా ఉద్యమ కార్యకర్తగా, నాయకుడిగా రాణించటం సామాన్య విషయం కాదు. ఈ కాదు కాదు అనుకుంటున్న కార్యస్థలిలోనే - దిగ్విజయంగా రాణించాడు యాసలపు సూర్యారావు. నీతికీ, నిజాయితీకి, నిబద్ధతకీ నిలువెత్తు రూపంగా నిలిచాడు. 62 ఏళ్ల సూర్యారావు ఈనెల 22న తుదిశ్వాస విడిచాడు.
సూర్యారావు పాఠశాలకు వెళ్లాడో లేదో తెలీదు. ఆ విషయం తనకే గుర్తు లేదు. మట్టి పలక మీద ఏవో కొన్ని అక్షరాలు దిద్దినట్టు గుర్తు. ఊహ తెలీనప్పటినుంచీ కష్టాలు సుపరిచితం. దేన్నీ ఆషామాషీగా తీసుకునే రకం కాదు. దేన్నయినా తరచి తరచి చూడాల్సిందే! గీటు పెట్టి నిగ్గు తేల్చాల్సిందే! తొక్కూ తాలూ తార్కిక వాదంతో పక్కకు తప్పు కోవల్సిందే! వాదనకు నిలబడని ఏ విషయాన్నీ అతడు నమ్మలేదు. కులాలూ మతాలూ, దేవుడూ దెయ్యం లాంటివి చిన్నప్పుడే అతడి మనసు తెరపై నుంచి మాయం అయిపోయాయి. కొందరికి ఆకలీ దారిద్య్రమూ ఎందుకో, ఇంకొందరికి ఆకాశ హార్మ్యాలూ తరగని విలాసాలూ ఎందుకో చిన్నప్పుడే తర్కించి, వాదించి ... ఎడతెగని ఆలోచనలకు గురయ్యాడు. 12 ఏళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీ పరిచయం, విజ్ఞాన తరగతుల ప్రభావం అతడి ఆలోచనలకు పదును పెట్టాయి. సత్యాన్వేషణకు సరైన మార్గం దొరికినట్టయింది. బాల్యంలో నేర్చుకున్న మట్టి పలక అక్షరాలను మనోక్షేత్రంలో నిరంతరం దిద్దడం మొదలెట్టాడు. 'ప్రజాశక్తి' పత్రికను ఇంటింటికీ పంచే పని చేస్తూనే - దాన్లోని వార్తలు, వ్యాసాలూ కూడబలుక్కొని చదివాడు. సైకిల్‌ షాపులో మెకానిక్కుగా ఉంటూ ఖాళీ సమయంలో పుస్తకాలు చదివాడు. తనలో తలెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరకటంతో- అతడి ఆలోచనల్లో, ఆచరణలో కొత్త పంథా మొదలైంది.
ప్రజానాట్యమండలి పరిచయం అతడిలో భావోద్వేగం రెక్కలు తొడిగింది. నెమ్మదిగా కవిత్వం రాయడం మొదలెట్టాడు. చుట్టూ చూస్తున్న అన్యాయాలపై నాటికలు రాశాడు. ప్రజల సమస్యలపై పాటలు అల్లాడు. పిల్లలకోసం కథలు వెలువరించాడు. సంస్క ృతి, జానపద కళలు అంటే ఎడతెగని మక్కువ. ఊరూరా తిరుగుతూ బిచ్చమెత్తుకునే కళాకారులతో స్నేహం చేశాడు. వాళ్ల పాటలు, మాటలూ రికార్డు చేశాడు. ఆ కళల పుట్టుకా, వికాసం, ప్రస్తుత పరిస్థితిపై పరిశోధనకు దోహదపడేలా వ్యాసాలు రాశాడు. ప్రాథమిక స్థాయి విద్య కూడా పాఠశాలలో నేర్వని మీరు ఇవన్నీ ఎలా చేయగలిగారు అని ఎవరైనా అడిగితే - ఒకే ఒక్క మాట చెప్పేవాడు : ''కమ్యూనిస్టు పార్టీ గొప్పదనం వల్ల... పార్టీ నేర్పిన ఆలోచనల వల్ల... పార్టీ నేర్పిన క్రమశిక్షణ, అధ్యయన పద్ధతుల వల్ల..'' అని.
సూర్యారావు 'ప్రజ్వలనమ్‌', 'తల్లీ గోదావరీ', 'ఆడు మగాడు', 'పేగుబంధం' పేరుతో నాలుగు కవితా సంపుటాలు వెలువరించారు. ఈ కవితలనిండా సమకాలీన సమస్యలే పరుచుకొని ఉంటాయి. కవితల్లో ఆవేదన, ఆకళింపు ఎంత కనిపిస్తుందో- అవసరమైన చోట ఆగ్రహమూ అంతే ధ్వనిస్తుంది. సమన్వయం, సహనం కనిపిస్తూనే సమరనాదమూ వినిపిస్తుంది. ఆయన కవిత్వం ఆలోచింపచేసేదిగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ప్రపంచీకరణ పేగుబంధాన్ని సైతం విచ్ఛిన్నం చేయడం, సెజ్‌లు రైతులను నిర్వీర్యుల్ని చేయడం; బహుళజాతి సంస్థలు గిరిజనులను, మత్స్యకారులను ఆవాసాలనుంచి వెల్లగొట్టడం .... ఇలాంటి నేటి భారతపు సమకాలీనత అంతా సూర్యారావు కవిత్వంలో సజీవ దృశ్యంగా కనిపిస్తుంది. అణగారిన వర్గాల ఆక్రందన, ఆవేదనా ఆయన అక్షరాల్లో ప్రతిధ్వనిస్తుంది. సమస్యను సమస్యగా చెప్పి ఊరుకోవడం కాదు. దాని మూలాల్లోకి, పర్యవసానాల్లోకి వెళ్లి పాఠకుడి కళ్లకడతాడు. ఎక్కడా నిరాశా, నిస్ప ృహా ధ్వనించదు. స్పష్టమైన కార్యాచరణ, విస్పష్టమైన ఆశాభావం పఠితల్లో కలిగిస్తాడు. తాను స్వయంగా సమస్యలపై పోరాడే కార్యకర్త కావడంవల్ల - ఆయన కవిత్వం నిండా వెల్లువెత్తే పిడికిళ్లూ, మార్మోగే కంఠధ్వనులూ అందమైన రేపటికి భరోసానిస్తాయి.
సూర్యారావు మూడు నాటికలు రాశారు. అవి : ఊరు మేల్కొంది, విముక్తి, మేల్కొలుపు. పాటలతో 'బతుకు పాట' ప్రచురించారు. 'పిట్టకొంచెం - కూత ఘనం' పేరుతో బాలల కథల సంపుటి వెలువరించారు. అనేక రాష్ట్రస్థాయి పోటీల్లో కవితలకు, కథలకు బహుమతులు పొందారు. వీటిన్నింటికీ మించి, తుదిశ్వాస విడిచేవరకూ క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఉద్యమ కార్యకర్తగా ఉన్నారు. సిపిఎం తరఫున రెండుసార్లు పెద్దాపురం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై, ప్రజల సమస్యలపై విశేష కృషి చేశారు. చెంచులు, గంగిరెద్దుల వారు వంటి సంచార జీవులకు పట్టణంలో స్థిరనివాసం, రుణాలు, రేషన్‌ కార్డులు ఇప్పించటానికి వివిధ దశల్లో పోరాడి, విజయం సాధించారు. సాహితీ స్రవంతి తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యారావు ఉద్యమ కార్యకర్తగా ఏ సమస్యలపై పనిచేశాడో వాటినే కవిత్వంగా, కథలుగా పలికించాడు. కవిగా, రచయితగా దేన్నయితే రాశాడో - దానినే ఆచరణలో పెట్టటానికి అహర్నిశలూ శ్రమించాడు. ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి రామ్మోహనరావు పేర్కొన్నట్టు - 'యాసలపు సూర్యారావు ధన్యజీవి. అక్షరాలా కష్టజీవుల కవి. ప్రజల మనిషి.' 

No comments:

Post a Comment