Saturday, 1 September 2012

  • పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం
మన ప్రజల్లో 11 శాతం మంది అపరిమితంగా పోషకాహారం తీసుకోవడంతో బాధపడుతున్నారు. అంటే, అనేక రకాల లేదా అనవసరమైన కేలరీలను తీసుకుంటున్నారు. మరోవైపు, పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య భారతదేశంలోనే అత్యధికంగా ఉంది. వెలిగిపోతున్న భారత్‌ అమితంగా తినడం వల్ల వచ్చే అనేక వ్యాధులతో బాధపడుతోంది. సరైన పోషకాహారం అందుబాటులో లేకపోవడం ఈ లోపానికి ప్రధాన కారణం. స్థూల అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 75 శాతం మంది, పట్టణాల్లో 73 శాతం మంది కనీస జీవనానికి అవసరమైన కేలరీల కంటే రోజువారీగా తక్కువ స్థాయిలో తీసుకుంటున్నారు.

ఆహార భద్రతపై నెల రోజులపాటు నిర్వహించిన ప్రచారం, ఆందోళన కార్యక్రమం పార్లమెంటు ముందు నిర్వహించనున్న ఐదు రోజుల ధర్నాతో ముగుస్తుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 2012, జులై 30న ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి ఐదు రోజుల పాటు నాలుగు వామపక్షాలు ధర్నా చేయనున్నాయి. నెల రోజుల ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఆందోళన నిర్వహించారు. పేదలందరికీ బిపిఎల్‌ కార్డులను జారీ చేసి తగిన మేరకు ఆహార ధాన్యాలను, ఇతర నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చెయ్యాలని, పిడిఎస్‌ నుంచి ఆహార ధాన్యాలు బ్లాక్‌మార్కెట్‌కు, లాభార్జనకు దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళనలు నిర్వహించారు.
దేశంలో ప్రతి ఒక్క బిపిఎల్‌, ఎపిఎల్‌ కుటుంబానికీ నెలకు కిలో రెండు రూపాయల చొప్పున 35 కిలోల ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు ఆహార భద్రతా చట్టాన్ని సత్వరం ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ ప్రచారాన్ని నిర్వహించారు. ఆకలి, ఆహార అభద్రత సమస్యలను పరిష్కరించేందుకు ఇదొక్కటే మార్గం.
ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆకలి సూచీ ( జిహెచ్‌ఐ) ప్రకారం తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న ప్రపంచంలోని 80 దేశాల్లో భారత్‌ 67వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్న వారిలో 25 శాతం మంది (దీనిని అంగీకరించాల్సి రావడం సిగ్గుచేటైన విషయం) భారతీయులున్నారు. ఈ విషయంలో ఉత్తర కొరియా, అంతర్గత కలహాలతో తల్లడిల్లుతూ విడిపోయిన సూడాన్‌ కంటే కూడా భారత్‌ దిగువ ర్యాంక్‌లో ఉంది. ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదేళ్ల లోపు వయస్సున్న వారు మూడింట రెండు వంతుల మంది భారత్‌లో ఉన్నారు. భారతదేశంలో 44 శాతం మంది పిల్లలు నిర్ణీత ప్రమాణం కంటే తక్కువ బరువుతో ఉన్నారు. 72 శాతం మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. 52 శాతం మంది గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడటం ఇంతకంటే ఘోరమైన విషయం. వారు భారత భవిష్యత్‌ తరానికి జన్మనివ్వనున్నారు. నివారించదగ్గ వ్యాధులతో భారత దేశంలో ప్రతి రోజూ వేలాది మంది బాలలు మరణిస్తున్నారు.
ఈ విషయంలో కూడా రెండు భారత దేశాలు ఏర్పడుతున్నాయి. మన ప్రజల్లో 11 శాతం మంది అపరిమితంగా పోషకాహారం తీసుకోవడంతో బాధపడుతున్నారు. అంటే, అనేక రకాల లేదా అనవసరమైన కేలరీలను తీసుకుంటున్నారు. మరోవైపు, పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య భారతదేశంలోనే అత్యధికంగా ఉంది. వెలిగిపోతున్న భారత్‌ అమితంగా తినడం వల్ల వచ్చే అనేక వ్యాధులతో బాధపడుతోంది. సరైన పోషకాహారం అందుబాటులో లేకపోవడం ఈ లోపానికి ప్రధాన కారణం. స్థూల అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 75 శాతం మంది, పట్టణాల్లో 73 శాతం మంది కనీస జీవనానికి అవసరమైన కేలరీల కంటే రోజువారీగా తక్కువ స్థాయిలో తీసుకుంటున్నారు.
భారత్‌ తన జిడిపి వృద్ధి రేటును తిరిగి సాధించగలిగితే ఈ పరిస్థితి మారుతుందనే అభిప్రాయం నెరవేరలేదు. ఈ శతాబ్దం తొలి దశకంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటు సంవత్సరానికి 1.3 శాతానికి తగ్గింది. ఆర్థిక సంస్కరణల పూర్వ దశాబ్దాలైన 1980లలో ఉన్న 2.7 శాతం ఉన్న వృద్ధి రేటు (ఇదే సమయంలో దేశంలో జిడిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉంది) ఆ తరువాత క్రమంగా తగ్గింది. ఫలితంగా ఆహారధాన్యాల తలసరి అందుబాటు రోజుకు 1990లో 494 గ్రాములుండగా, 2009లో 438 గ్రాములకు తగ్గిపోయింది.
నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో రేషన్‌ కార్డుల ద్వారా అమలు జరిగిన సార్వజనీన ప్రజా పంపిణీ వ్యవస్థను 1997లో రద్దు చేశారు. సార్వజనీనంగా కొన్ని లోపాలు, అవినీతి ఉన్నప్పటికీ 1991లో 2.1 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, అంటే అందుబాటులో ఉన్న ఆహార నిల్వల్లో 45 శాతం ఆహార ధాన్యాలను రేషన్‌ కార్డుల ద్వారా పంపిణీ చేశారు. 2001 నాటికి పంపిణీ చేసిన ఆహార ధాన్యాల పరిమాణం 1.3 కోట్ల టన్నులకు తగ్గింది. ఈ దేశంలో మెజారిటీ ప్రజల పేదరికానికి, బాధలకు సంబంధించిన వాస్తవాలను ఆమోదించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో అవసరానికి మించి నిల్వ ఉన్న ధాన్యాలను బిపిఎల్‌ ధరలకు పేదలకు పంపిణీ నిమిత్తం విడుదల చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. 2012, జూన్‌ 1 నాటికి ప్రభుత్వం వద్ద 8.23 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. అత్యవసర అవసరాల నిమిత్తం నిల్వ ఉంచే పరిణామం కంటే 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఎక్కువగా గోదాముల్లో ఉన్నాయి. ప్రభుత్వ గోదాములు ఆహార ధాన్యాల నిల్వలతో పొంగిపొర్లుతుండటంతో బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉంచిన ధాన్యాల్లో 66 లక్షల టన్నులు ముక్కిపోయాయి. అయినప్పటికీ యుపిఎ-2 ప్రభ్వుం ఈ ధాన్యాన్ని విడుదల చేసేందుకు నిరాకరిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో సేకరించే ఆహారధాన్యాలను నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం కనీసం రూ.20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని మాజీ ఆర్థిక మంత్రి, భారత కొత్త రాష్ట్రపతి పార్లమెంటులో ఇంతకు ముందు ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ నిల్వలను విడుదల చేసేందుకు నిరాకరిస్తోంది. దేశ ప్రజలను ఆకలితో అలమటింపజేస్తూ లాభం కోసం ఈ నిల్వలను ఎగుమతి చెయ్యాలని భావిస్తోంది. వీరిని మృత్యు బేహారులుగా గాక ఏమనాలి?
ఈ పత్రిక ప్రచురణకు వెళ్లే రోజున, అంటే జులై 25న భారత రిపబ్లిక్‌ 13వ రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఆ తరువాత చేసిన ప్రసంగంలో అన్ని సమానత్వాల కంటే ఆర్థిక సమానత్వం అత్యంత ముఖ్యమైందని పేర్కొన్నారు. 'మన అభివృద్ధి నిజం కావాలంటే, ఈ దేశంలోని నిరుపేదలు అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో తామూ భాగస్వాము లని భావించాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే 'పేదరిక రక్కసిని నిర్మూలించేందుకు, భారతదేశాన్ని యువత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు' మన భవిష్యత్తుకు కొత్త మార్గదర్శకత్వాన్ని నిర్దేశించారు. 'ఆకలిని మించిన అవహేళన లేదు. ఆర్థిక సంస్కరణలకు మూలమైన ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతాలు (సంపన్నులకు కల్పించే ప్రయోజనాలు అంతిమంగా పేదలకు ప్రయోజనం చేకూర్చుతాయని చెప్పే ఆర్థిక సిద్ధాంతాలు) పేదల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చవు. ఆధునిక భారతదేశ నిఘంటువు నుంచి పేదరికాన్ని నిర్మూలించాలంటే అట్టడుగు స్థాయిలో ఉన్న వారిని పైకి తీసుకురావాలి' అని ప్రణబ్‌ పేర్కొన్నారు.
ఈ దార్శనికత సాధించాలనే చిత్తశుద్ధి ఉంటే ఆహార హక్కును మన ప్రజల ప్రాథమిక హక్కుగా చేయాలని తన ప్రభుత్వాన్ని ప్రణబ్‌ ముఖర్జీ ఆదేశించాలి. గౌరవనీయులైన రాష్ట్రపతిగారూ, మన దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికీ ప్రతి నెలా కిలో రెండు రూపాయలకు 35 కిలోల ఆహారధాన్యాలను సరఫరా చేసేలా శాసనం చెయ్యడం ద్వారా మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా మన ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.
ప్రాథమికంగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, తద్వారా మన దేశం నుంచి ఆకలిని పారదోలేందుకు వామపక్షాలు పార్లమెంటు ముందు చేయబోయే ధర్నా ద్వారా యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి చేయబోతున్నాయి. ఇటువంటి ప్రజా సమీకరణలను భవిష్యత్తులో మరింతగా పటిష్టం చేసి ఆకలి, పేదరికం లేని మెరుగైన భారతదేశాన్ని నిర్మించాల్సి ఉంది.
(జులై 25, 2012)

No comments:

Post a Comment