Saturday, 1 September 2012

ఆహార భద్రత ఎవరికి?

ప్రజలందరికీ ఆహార భద్రతను సమకూర్చాలంటే ప్రభుత్వ విధానాల్లో గణనీయమైన మార్పు రావాలి. ఆహార పంటల సాగును ప్రోత్సహించాలి. రైతాంగానికి అవసరమైన ఎరువులను, పురుగు మందులను సాధ్యమైనంత తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలి. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం మార్కెట్‌లో ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువగా జోక్యం చేసుకోవాలి. ఎఫ్‌సిఐ వంటి ప్రభుత్వరంగ సంస్థల చేత ఆహార ధాన్యాలను సాధ్యమైనంత ఎక్కువగా కొనుగోలు చేయించాలి. లక్షిత సబ్సిడీ వ్యవస్థకు బదులుగా సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను ఆచరణలోకి తీసుకురావాలి. నగదు బదిలీ పథకాల ఆలోచనను కూడా మానుకోవాలి. గ్రామీణ ఉపాధి హామీని మరింత విస్తృతంగా అమలు చేయడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధికి గ్యారంటీ ఇవ్వాలి.
అది విజయనగరం జిల్లా కురుప్పాం మండలంలోని జంగురపాడు గ్రామం. రహదారి సౌకర్యాలకు దూరంగా మారుమూల ఉండే ఈ గ్రామంలో అత్యంత వెనుకబడిన గిరిజన తెగలకు చెందిన సవరలు నివసిస్తారు. ఆ గ్రామాన్ని ఇటీవల ఐద్వా బృందం సందర్శించింది. ఆ ప్రాంతంలో ఒకప్పుడు కొండలమీద సాగైన కందులు, అనుములు, జినుములు వంటి ఆహార పంటల స్థానంలో జీడిమామిడి వంటి వాణిజ్య పంటలు ఆక్రమించాయి. జీడిమామిడి తోటలతో పాటే అప్పులు స్థానిక ప్రజలను పలకరించాయి. ఆ గ్రామానికి చెందిన మోక్షయ్య అనే సవర తెగకు చెందిన గిరిజన రైతు మా బృందంతో మాట్లాడుతూ తనకు రూ.16 వేల అప్పు ఉన్నట్లు చెప్పాడు. 'జీడి వేశా. పంట సరిగ్గా పండ లేదు. రేటు కూడా రాలేదు'. ఇది అతనిచ్చిన సమాధానం. సాంప్రదాయిక ఆహార పంటలకు బదులుగా వాణిజ్య పంటలు సాగుచేయడంతో తిండిగింజలకు కూడా మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి స్థానికంగా ఏర్పడింది. డిఎపి, యూరియా వంటి ఎరువులతో పాటు స్థానికులకు కనీసం పేరు కూడా తెలియని పురుగు మందుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో బ్యాంకులతో పాటు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కూడా గిరిజన గ్రామాల్లోకి వచ్చారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా అప్పుకు ఆమడ దూరంలో ఉండే గిరిజనులు కూడా రుణగ్రస్థులుగా మారిపోతున్నారు. పోనీ, నానా కష్టాలు పడి పండించిన జీడిపప్పును వారు తింటున్నారా అంటే అదీ లేదు. జీడి సాగు చేసినా చాలీచాలని అరకొర తిండే వారికి ఇప్పటికీ దిక్కు! ధనిక దేశాల వినియోగం కోసం ఎక్కువ ఆదాయం వస్తుందని వారిని భ్రమల్లో ఉంచి సంప్రదాయ సాగు నుంచి వాణిజ్య పంటల వైపు మళ్లించిన ప్రభుత్వాలు ధర విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. ఫలితం సరైన ఆహారం లేకపోవడంతో వెంటాడే ఆరోగ్య సమస్యలు, తలకు మించిన అప్పులు మాత్రం గిరిజనులకు మిగిలాయి. ఇదే పరిస్థితి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని పలు గ్రామాల్లోనూ కన్పించింది. ఒకప్పుడు పోడు వ్యవసాయం, పశుపెంపకంతో కనీసపు ఆహార భద్రతను పొందిన గిరిజన గ్రామాలు ఇప్పుడు భిన్నమైన స్థితిలో ఉన్నాయి. తిండిగింజల కోసం ప్రభుత్వమిచ్చే కోటా బియ్యంపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ కోటా బియ్యానికీ ఎసరు పెట్టే విధానాలను అమలు చేయడానికి పాలకులు రంగం సిద్ధంచేస్తున్నారు. ఈ గ్రామాల రైతులు చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే స్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని కొన్ని సంవత్సరాల నుంచి కోరుతున్నారు. గిరిజనసంఘం ఈ విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అయితే, సంవత్సరాల తరబడి ఈ విషయంపై దృష్టి సారించని పాలకులు జీడిమామిడి తోటల సాగుకు మాత్రం స్థానికులను ప్రోత్సహించారు. సముద్ర తీర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో కూడా ధాన్యం సాగు కనుమరుగైంది. అక్వా కల్చర్‌ పేరుతో సారవంతమైన పొలాలు సైతం రొయ్యల చెరువులుగా మారిపొయ్యాయి. ప్రారంభంలో కాసుల వర్షం కురిపించిన రొయ్యల సాగు ఇప్పుడు ఏమాత్రం గిట్టుబాటుకాకుండా పోయింది. మళ్లీ వరి సాగు చేద్దామన్నా సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ సమస్యలూ సరేసరి! ఇక్కడి ప్రజలు కూడా తిండిగింజల కోసం ప్రభుత్వ కోటా బియ్యం మీదనో, మార్కెట్‌ మీదనో ఆధారపడుతున్నారు. విదేశీయుల విలాసవంతమైన ఆహారపు అలవాట్లకు స్థానిక ప్రజల ఆహార భద్రతను ప్రభుత్వం పణంగా పెట్టింది. ఫలితంగా రైతాంగం రోజురోజుకీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మెజార్టీ ప్రజానీకానికి ఆహారధాన్యాత కొరత ఏర్పడింది.
ప్రజలేం తింటున్నారు ...?
ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం దేశంలో పేదరికం తగ్గుతోంది. పాలకవర్గాలకు వంతపాడే కార్పొరేట్‌ మీడియా, నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వరి, గోధుమలపై ఆధారపడే ప్రజానీకం ఇప్పుడు బలవర్థకమైన బహుళ రకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారని వారు చెబుతున్నారు. మాంసం, తృణధాన్యాలు, పళ్లు ఇలా అనేక రకాలు తీసుకుంటుండంతో వరి, గోధుమల వినియోగం తగ్గుముఖంపడుతోందన్నది వారి వాదన! కార్పొరేట్‌ నిపుణులు కొండెక్కి మరీ కూస్తున్న ఈ కూతలు నిజమేనా? ఆహార రంగ నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం బరువులు ఎత్తడం, పొలం పనులు, భవన నిర్మాణరంగ కార్మికులు వంటి శారీరక శ్రమ చేసే వారు పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా రోజుకు మూడు వేల కేలరీల ఆహారం తీసుకోవాలి. కొంచెం తక్కువ శారీరక శ్రమ చేసే వాళ్లు, వైట్‌ కాలర్‌ ఉద్యోగులు కనీసం 2,400 కేలరీల ఆహారం తీసుకోవాలి. కనీస ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ మాత్రపు కేలరీలున్న ఆహారం తప్పనిసరి అన్నది ఆహార నిపుణుల మాట! ఈ మేరకు ఆహారాన్ని మన ప్రజలు తీసుకుంటున్నారా? నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ప్రపంచంలోనే శతకోటీశ్వరుల జాబితాలో మన దేశానికి, రాష్ట్రానికి చెందిన కొద్దిమంది స్థానం పొందుతూ ఉంటే, మరోవైపు కనీస తిండికి నోచుకోని వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆర్థిక సంస్కరణలు జోరుగా ప్రారంభమైన 90వ దశకం తరువాత ఈ పరిణామం మరింత వేగం దాల్చింది. 1970వ దశకంతో పోల్చితే తక్కువ కాలరీల ఆహారంతో రోజులీడుస్తున్న వారి సంఖ్య ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచీ పెరుగుతోంది. (పూర్తివివరాలు టేబుల్‌లో...)1970వ దశకంలో సగటున రోజుకి 460 గ్రాముల తృణధాన్యాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉండగా, 1990లో 490 గ్రాములకు పెరిగి 2007-09కి ఆ మొత్తం 440 గ్రాములకు పడిపోయింది. 1991లో సరళీకరణకు మన్మోహనుడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే! మన ప్రజలు చాలీచాలని తిండిగింజలతో రోజులు వెళ్లదీస్తుంటే, నూతన ఆర్థిక విధానాలను బలవంతంగా రుద్దుతున్న అమెరికాలో దీనికి భిన్నమైన స్థితి. అక్కడి ప్రజల తలసరి ఆహార ధాన్యాల వినియోగం 890 కిలోల పైమాటే!
ప్రభుత్వం చేస్తున్నదేమిటి?
పేదరికాన్ని తగ్గించి, దేశ ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా పేదరికపు లెక్కలను తగ్గించి చూపడానికి ప్రయత్నిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 2,200, పట్టణ ప్రాంతాల్లో 2,100 కేలరీల కంటే తక్కువ పోషక విలువలున్న ఆహారం తింటున్న వారు 75 శాతం ఉన్నారని ఒకవైపు చెబుతూనే మరోవైపు డబ్బు రూపంలో ఆదాయపు పరిమితిని నిర్థారించడం ద్వారా పేదరికం తగ్గిందని చెప్పడానికి దొంగనాటకం ఆడుతోంది. రోజుకు గ్రామాల్లో రూ.22, పట్టణాల్లో రూ.28 మొత్తాన్ని పేదరికానికి గీటురాయిగా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకన్నా ఎక్కువ సంపాదించేవారు పేదలు కాదని ప్రణాళికా సంఘం అంటోంది. ప్రణాళికా సంఘం నిర్థారించిన 22, 28 రూపాయలతో రోజుకు 1,800 కేలరీల పోషక విలువలున్న ఆహారాన్ని పొందడం కూడా కష్టమే! ఇక కనీస ఆహార భద్రత ఎక్కడీ పేదరికపు ప్రమాణాలను ఇలా అర్థంపర్థం లేకుండా తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 21 శాతానికి పేదరికం తగ్గిందని సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. ఈ లెక్కల ప్రకారం హమాలీలు, భవన నిర్మాణ, వ్యవసాయ కార్మికులు కూడా పేదరికపు పరిధిలోకి రారు. పేదరికం ప్రాతిపదికగా ప్రభుత్వం అమలుచేసే పథకాలకు పట్టణ ప్రాంతాల్లో 52 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం మంది వాస్తవ పేదలు దూరమవుతారు. ఈ కాకి లెక్కలనే ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం దేశ ప్రజల ఆహారభద్రతకు పెనుముప్పుగా మారిన విధానాలను అమలు చేస్తోంది. ఆహార ధాన్యాలకు బదులుగా వాణిజ్య పంటల సాగుకు ప్రాధాన్యతనిస్తోంది. స్థానిక అవసరాలకు కాకుండా విదేశాలకు ఎగుమతి చేయడానికి, అక్కడి వారి విలాసవంతమైన ఆహార అలవాట్లను తీర్చడమే మన ప్రభుత్వాల తక్షణ బాధ్యతగా మారింది. దీంతో మన ఆహార పంటల సాగుకు కావలసిన కనీస అవసరాలను రైతులకు ఏర్పాటు చేయడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను తన అవసరాలకు కూడా నిల్వ చేసుకోలేని స్థితికి రైతులను ప్రభుత్వం నెట్టివేసింది. చాలినంత సంఖ్యలో గోడౌన్లు నిర్మించకపోవడంతో పండిన పంట మొత్తాన్నీ ఎంతో కొంత ధరకు మార్కెట్‌లో తెగనమ్మడం, తన అవసరాలకు అదే మార్కెట్‌ నుంచి అత్యధిక ధరకు కొనుగోలు చేయడం రైతులకు అలవాటు చేసింది. ఉండటానికే సరైన ఇళ్లులేని స్థితిలో ఉన్న గ్రామీణ రైతాంగం ఆహార పంటల నిల్వకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే స్థితిలో ఎలాగూ లేరు!
అరకొర భద్రతా గాలికి ...!
ప్రభుత్వ విధానాల కారణంగా కోటా బియ్యంపై ఆధారపడిన పేద ప్రజలకు అరకొరగా లభిస్తున్న ఆహారాన్ని వారి నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రేషన్‌ షాపుల్లో సరుకులకు బదులుగా నగదును లబ్ధిదారులకు అందించాలన్న ఆలోచన దీనిలో భాగమే! ఈ విధానం అమలులోకి వస్తే రేషన్‌ షాపుల్లో సరుకులు ఇవ్వడం నిలిచిపోతుంది. దానికి బదులుగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. ఆ మొత్తానికి మిగిలిన మొత్తాన్ని జమ చేసి బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువులను కొనుక్కోవాలి. మార్కెట్‌లో ధరలను నియంత్రించడం ప్రభుత్వం చేతుల్లో లేదని ఇప్పటికే తేలిన విషయమే! అంటే మార్కెట్‌ దయపైనే సాధారణ ప్రజానీకం ఆధారపడాలి. అదే జరిగితే ఇప్పుడు అందుతున్న కేలరీల ఆహారం కూడా మెజార్టీ ప్రజలకు అందదు. అంటే! ఆహారభద్రత కాస్తా గాలికి కొట్టుకుపోతుంది.
ఏమి చేయాలి ...?
ప్రజలందరికీ ఆహార భద్రతను సమకూర్చాలంటే ప్రభుత్వ విధానాల్లో గణనీయమైన మార్పు రావాలి. ఆహార పంటల సాగును ప్రోత్సహించాలి. రైతాంగానికి అవసరమైన ఎరువులను, పురుగు మందులను సాధ్యమైనంత తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలి. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం మార్కెట్‌లో ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువగా జోక్యం చేసుకోవాలి. ఎఫ్‌సిఐ వంటి ప్రభుత్వరంగ సంస్థల చేత ఆహార ధాన్యాలను సాధ్యమైనంత ఎక్కువగా కొనుగోలు చేయించాలి. లక్షిత సబ్సిడీ వ్యవస్థకు బదులుగా సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను ఆచరణలోకి తీసుకురావాలి. నగదు బదిలీ పథకాల ఆలోచనను కూడా మానుకోవాలి. గ్రామీణ ఉపాధి హామీని మరింత విస్తృతంగా అమలు చేయడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధికి గ్యారంటీ ఇవ్వాలి. దీనికోసం ప్రభుత్వంపై సంఘటిత పోరాటాల ద్వారా ఒత్తిడి తీసుకురావాలి.
-ఎస్‌ పుణ్యవతి

No comments:

Post a Comment